10నిమిషాల్లో ఇద్దరు: ఒకే ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు
కాంట్రాక్టర్ల వద్ద వేర్వేరుగా లంచం తీసుకుంటూ ఒకే కార్యాలయానికి చెందిన ఇద్దరు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు.
సిరిసిల్ల: కాంట్రాక్టర్ల వద్ద వేర్వేరుగా లంచం తీసుకుంటూ ఒకే కార్యాలయానికి చెందిన ఇద్దరు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. అయితే 10 నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు ఇలా దొరకడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే... రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకావుపేటకు చెందిన కాంట్రాక్టర్ కొండం కృష్ణారెడ్డి కోనరావుపేట మండలం నిజామాబాద్, వెంకావు పేటల్లోని చెరువుల అడ్డుగోడలు నిర్మించాడు. ఆయనకు రావాల్సిన రూ. 15,40,000 బిల్లు చెల్లింపునకు సంబంధించి రూ. 12,75,994 ఎంబి చేశారు.

అయితే లంచం కోసం ఇఇ చిరంజీవులు కాంట్రాక్టర్‌ను నాలుగు నెలలుగా వేధింపులకు గురిచేయగా.. ఆయన పెద్ద నోట్ల రద్దు వల్ల ముందుగా లంచం ఇవ్వలేకపోతున్నానని, చెక్కు రిలీజైన తర్వాత ఇస్తానని చెప్పినా చిరంజీవులు వినిపించుకోలేదు. దీంతో కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఇఇ నీటి పారుదల శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో కాంట్రాక్టర్ వద్ద రూ. 15,000 తీసుకుంటుండగా పట్టుకున్నారు.
అయితే ఇదే కార్యాలయంలో డిఇగా పనిచేస్తున్న నరేష్‌సింగ్ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డికి రావాల్సిన రూ. 1,10,000 ఇఎండి డబ్బు ఇచ్చేందుకు లంచం కోసం వేధించాడు. ఇఎండి చెక్కు అందిన తర్వాత డబ్బులిస్తానని చెప్పినా వినలేదు. దీంతో ఎసిబి అధికారులను ఆశ్రయించిన కృష్ణారెడ్డి.. వారు చెప్పిన విధంగా డిఇ నరేష్‌సింగ్‌ను ఆయన చాంబర్‌లో రూ. 10,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అధికారులిద్దర్ని అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డిఎస్‌పి సుదర్శన్‌గౌడ్ తెలిపారు.












Click it and Unblock the Notifications