సీఎం రేవంత్ సోదరుడుకి సిట్ నోటీసులు, కీలక మలుపు..!!
ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు. ఇప్పటి వరకు పలువురు ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులను విచారణ చేసిన సిట్.. రాజకీయ నేతల విచారణ వేగవంతం చేసింది. తాజాగా ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ సుదీర్ఘంగా విచారించింది. కాగా, తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీలకు విచారణ కు రావాలని నోటీసులు ఇచ్చిన సిట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డిని విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది.
ఫోన్ టాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. విచారణ వేగవంతం చేసింది. ఫోన్ టాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారిస్తున్న సిట్.. బాధితుల నుంచి స్టేట్ మెంట్స్ తీసుకుంటోంది. ఇప్పటికే మాజీ సీఎస్ లు సోమేశ్, శాంతి కుమారితో పాటుగా మాజీ నిఘా చీఫ్ అనిల్ కుమార్ నుంచి వివరాలు సేకరించింది. కాగా, తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేయటం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కొండల్ రెడ్డితో పాటుగా రేవంత్ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే ఆరోపణలు.. ఫిర్యాదులు ఉన్నాయి.

దీంతో, ఇప్పుడు సిట్ కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొండల్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంట లకు సిట్ ఎదుట హాజరు కావలని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది.
బుధవారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కొండలరావు, సందీప్ ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. వివరాల నమోదుకు జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో.. ఇప్పుడు సిట్ తీసుకునే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications