SLBC Tunnel: ఎస్ఎల్బీసీ సొరంగంలో 8మంది కార్మికుల మృతి..! మట్టి, బురదలో బాడీలు...?
శ్రీశైలం ఎడమకాలువ సొరంగంలో వారం రోజుల క్రితం చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల్ని తీసుకొచ్చేందుకు వివిధ వర్గాలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇవాళ టన్నెల్ లోపల 8 మంది కార్మికుల మృతదేహాల్ని గుర్తించినట్లు సమాచారం. వాటిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారం రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ తో పాటు వివిధ టీమ్స్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాని దీన్ని బట్టి అర్ధమవుతోంది.

ఇవాళ ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది. సొరంగం తవ్వేందుకు ఉపయోగించిన టీబీఎం మిషన్ అందులో చిక్కుకుపోవడంతో దాన్ని రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో కట్ చేశారు. అనంతరం సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు అవకాశం లభించింది. లోపలికి వెళ్లి చూడగా.. అందులో కార్మికుల మృతదేహాలు బురద, మట్టిలో కూరుకుపోయి కనిపించాయని తెలుస్తోంది. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
వారం రోజులుగా సొరంగంలో ఉన్న కార్మికుల్ని అధికారులు, సహాయక సిబ్బంది చేయని ప్రయత్నం లేదు. తాజాగా అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేంగ్ రాడార్ ను కూడా వాడారు. దీని సాయంతో సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతంలో కింద ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ మృతదేహాల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. వెంటనే దగ్గరకు వెళ్లి మట్టి, బురద తొలగిస్తే అందులో మృతదేహాలు కనిపించాయని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక సిబ్బందిని అక్కడికి రప్పించి వాటిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications