ఆ పాపానికి సహకరించొద్దు.. అదే ఫ్యాషనైపోయింది: రాజా సింగ్ Vs సీపీ సజ్జనార్
హైదరాబాద్: గోవుల అక్రమ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. గోవుల అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారంటూ రాజా సింగ్ చేసిన ఆరోపణలపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరోక్ష వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసులపై రాజా సింగ్ తీవ్ర ఆరోపణలు
పోలీసులు డబ్బులు తీసుకుని గోవుల అక్రమ రవాణా వాహనాలను అనుమతిస్తున్నారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. అక్రమ రవాణా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని, వాళ్లకి దొరకని వాహనాలు తమకెలా పట్టుబడుతున్నాయని ప్రశ్నించారు.

ఆ పాపానికి సహకరించొద్దు.. వేతనాలు చాలకపోతే..
వేతనాలు సరిపోకుంటే భిక్షమెత్తి అయినా ఇస్తామని, అంతేకానీ, ఇలాంటి పాపం చేయొద్దని రాజా సింగ్ పోలీసులకు విన్నవించారు. మీడియా ప్రతినిధులు రాజా సింగ్ ఆరోపణలను సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకురాగా.. ఆయన ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై బహిరంగంగా విమర్శలు చేయడం ఫ్యాషనైపోయిందని మండిపడ్డారు.

రాజా సింగ్ వ్యాఖ్యలపై సీపీ సజ్జనార్ ఆగ్రహం..
బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు తగదని ఎమ్మెల్యే రాజా సింగ్‌కు హితవు పలికారు సీపీ సజ్జనార్. ఖచ్చితంగా అలాంటి ఘటనలు జరిగాయని భావిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, అప్పటికీ చర్యలు తీసుకోలేదని భావిస్తే బహిరంగంగా విమర్శలు చేయవచ్చని అన్నారు. అంతేగాక, పోలీసులు డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయా? అని ఎమ్మెల్యే రాజా సింగ్‌ను సీపీ సజ్జనార్ ప్రశ్నించారు. ఆధారాలుంటే తమ ముందుకు తీసుకురావాలన్నారు.

మీరు ఇలాగే ఉంటే.. మేము అలాగే ఉంటాం..
కాగా, సీపీ వ్యాఖ్యలపై మళ్లీ రాజా సింగ్ స్పందించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో కానిస్టేబుల్‌ను పెడితే గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన ఒక్క వాహనమూ రాదని అన్నారు. తాము ఇలాగే ఉంటామని సీపీ భావిస్తే.. తామూ అలాగే కామెంట్ చేస్తామని రాజా సింగ్ స్పష్టం చేశారు. కాగా, నగరంలో అక్రమంగా గోవులు తరలిస్తున్న వాహనాలను రాజా సింగ్ గతంలో పలుమార్లు పట్టుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications