స్నేక్ గ్యాంగ్ కేసు: సిఐకి హైకోర్టు సమన్లు
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ కేసులో హైకోర్టు శుక్రవారం హైదరాబాదు పాతబస్తీలోని పహడీషరీఫ్ సిఐకి సమన్లు జారీ చేసింది. స్నేక్ గ్యాంగ్ సభ్యుడిగా తలేబ్ బిన్ మొహమ్మద్ దయానీని నిర్బంధించడానికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణపై ఈ నెల 9వ తేదీన తమ ముందు హాజరు కావాలని హైకోర్టు సిఐకి సమన్లు జారీ చేసింది.
తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ దయానీ తల్లి సోఘ్రా హుస్సేన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ ఆ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

పోలీసులు పెద్ద యెత్తున రంగారెడ్డి జిల్లా కొత్తపేటలోని ఎర్రకుంటలో గల తమ ఇంటిపై గతవారం పోలీసులు దాడి చేసి తన కుమారుడిని తీసుకుని వెళ్లారని దయానీ తల్లి ఆరోపించారు. తన కుమారుడిని వెంటనే విడుదల చేయించాలని ఆమె కోరారు.
అక్రమ నిర్బంధం తన కుమారుడి కెరీర్‌ను దెబ్బ తీస్తుందని, అందుకు హోం కార్యదర్శి నుంచి నష్టపరిహారం ఇప్పించాలని ఆమె అన్నారు. ఆమె పిటిషన్‌లో చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు అంతకు ముందు సిఐని ఆదేశించింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ నెల 9వ తేదీ తమ ముందు హాజరు కావాలని హైకోర్టు సిఐని ఆదేశించింది.












Click it and Unblock the Notifications