హైదరాబాద్ కు సోనియా - ప్రియాంక: రాహుల్ యాత్ర - మునుగోడు బై పోల్..!!
మునుగోడు ఉప ఎన్నిక వేళ..కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణలో మొహరిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో ప్రవేశిస్తోంది. నవంబరు 7 వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో ఏఐసీసీ ముఖ్య నేతలందరూ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నెల 26 నుంచి జరిగే పాదయాత్రలో వేర్వేరు చోట్ల పార్టీ అగ్రనేతలు అశోక్ గెహ్లాట్, భగేలా, సూర్జేవాలా, దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్ పాల్గొననున్నారు. మునుగోడు బై పోల్ జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ అగ్రనాయకత్వం అక్కడ నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేకపోవటంతో మునుగోడు లో ప్రభావం చూపించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తోంది.
అందులో భాగంగా..నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుండగా.. సరిగ్గా రెండు రోజుల ముందు.. హైదరాబాద్‌కు గాంధీ కుటుంబం తరలిరానుంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాదయాత్ర చేయనుండగా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సైతం ఆయనతో కలిసి నడవనున్నారు. కర్ణాటకలో సోనియా రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు.

నవంబరు 1న శంషాబాద్‌లోని మాతా టెంపుల్ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర.. బహుదూర్‌పురా- చార్మినార్- గాంధీభవన్ మీదుగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ఇందిర విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత.. అక్కడ జరిగే సభలో రాహుల్ మాట్లాడనున్నారు. ఆ రాత్రి బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో బస చేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే సోనియా- ప్రియాంక.. రాహుల్‌తో కలిసి నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు (ఆదివారం) రాహుల్ యాత్ర కర్ణాటకలోని రాయ్‌చూర్ నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా నారాయణ్‌పేట జిల్లాలోకి ప్రవేశించనుంది. సోమ, మంగళ, బుధ వారాల్లో పాదయాత్రకు విరామం ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ ఢిల్లీ వెళ్లనున్నారు. దీపావళి పర్వదినంతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాహుల్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను శుక్రవారం రాత్రి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ పరిశీలించారు. రాహుల్ యాత్ర కీలకం కావటం..అదే సమయంలో మునుగోడు బై పోల్ ఉండటంతో ఇప్పుడు టీపీసీసీ రెండు సమన్వయం చేసుకోవాల్సి ఉంది.