అమ్మ స్థానాన్ని ఇచ్చారు.. రుణం తీర్చుకునే ఛాన్స్ ఇవ్వండి: తెలంగాణ ప్రజలకు సోనియా వినతి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. పోలింగ్‌కు ఇంకో రెండు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. చివరి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.
30వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

చివరి రోజున కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయింది. అనివార్య కారణాల వల్ల తెలంగాణలో సోనియాగాంధీ పర్యటించట్లేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
అదే సమయంలో- ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సోనియా గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీన జరగబోయే పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం బలిదానాలను ఇచ్చిన వారి కలను సాకారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం నన్ను అమ్మ అని పిలిచింది...సోనియా గాంధీ ఎమోషనల్ వీడియో..!#SoniaGandhi #TelanganaCongress #TelanganaElections2023 #TelanganaElection2023 #Telangana #Oneindaitelugu pic.twitter.com/PogtjbZSYt
— oneindiatelugu (@oneindiatelugu) November 28, 2023
తెలంగాణ ప్రజలు తనకు అమ్మగా పిలుస్తారని, తనకు అమ్మ స్థానాన్ని ఇచ్చారని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు కోసం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అని నినదించారు. జై తెలంగాణ అంటూ ముగించారు.












Click it and Unblock the Notifications