షిర్డీ వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త..
షిర్డీ సాయిబాబాకి ప్రపంచ వ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. "సబ్ కా మాలిక్ ఏక్" అనే తత్వం ఆయనకు భక్తుల హృదయాలలో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించింది. సేవ, దయ, భక్తి, ఉపదేశాలతో నిండిన సాయిబాబా జీవితం ఎందరికో ఆరాధన పూర్వకంగా నిలుస్తుంది.
కాగా మహారాష్ట్రలోని షిర్డీ.. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా మారింది. రోజూ వేల మంది భక్తులు, వారాంతాల్లో మరియు పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు సాయిబాబా సమాధిని దర్శించేందుకు వస్తుంటారు. షిర్డీ ఆలయం ప్రాంగణంలో ఆరాధనలు, పల్లకీ సేవలు, అన్నదాన కార్యక్రమాలతో నిత్యం రద్దీగా ఉంటుంది.

ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే శాఖ షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు సాయిబాబా దర్శనం కోసం షిర్డీకి వెళ్తుండగా.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ - నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లు 2024 జులై 3 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
స్పెషల్ ట్రైన్స్..
సికింద్రాబాద్ - నాగర్‌సోల్ స్పెషల్ రైలు (07007)..
ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45కి నాగర్‌సోల్ చేరుకుంటుంది.
నాగర్‌సోల్ - సికింద్రాబాద్ స్పెషల్ రైలు (07002)..
ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30కి నాగర్‌సోల్ నుంచి బయలుదేరి, శనివారం ఉదయం 7.30కి సికింద్రాబాద్ చేరుతుంది.
ఈ రైళ్లు మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బని, జాల్నా, ఔరంగాబాద్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రయాణికుల కోసం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, షిర్డీ యాత్రను సురక్షితంగా పూర్తి చేయొచ్చు. ప్రయాణ సమయంలో ప్రాథమిక వసతుల సమాచారం కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.
ఇక దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి షిర్డీ వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు సైతం రైల్వే శాఖపై ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications