దక్షిణ మధ్య రైల్వే సంచలనం.. 78 రైళ్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. . ఆసిఫాబాద్-రేచ్ని రైల్వే స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతుండటంతో మొత్తం 78 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 26 రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య తిరిగే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలును జూన్ 26 నుంచి జులై ఆరోతేదీ వరకు రద్దు చేశారు. పుణె-కాజీపేట రైలును జూన్ 28, జులై 5, కాజేపేట-పుణె రైలును జూన్ 30, జులై న రద్దు చేశారు.
హైదరాబాద్-గోరఖ్‌పుర్ జూన్ 28న, గోరఖ్‌పుర్-హైదరాబాద్ జులై 30న రద్దయ్యాయి. సికింద్రాబాద్-రాక్సల్ మధ్య రాకపోకలు సాగించే మూడు రైళ్లు జూన్ 26, 27, 28 తేదీల్లో రద్దయ్యాయి. సికింద్రాబాద్-దానాపూర్ మధ్య తిరిగే ఆరు రైళ్లను ఈనెల 27, 28, 29, జులై 1 తేదీల్లో, సికింద్రాబాద్-సుబేదార్‌గంజ్ మధ్య తిరిగే రైళ్లను జూన్ 27, జులై 4న, గోరఖ్‌పుర్-జడ్చర్ల రైలు జూన్ 29న, జడ్చర్ల-గోరఖ్ పూర్ రైలు జులై 1న రద్దయ్యాయి.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు
తెలంగాణ, దురంతో రైళ్లను, కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా నడుపుతున్నారు. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను రైళ్ల ప్రయాణ మార్గం నుంచి తొలగించారు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న తెలంగాణ ఎక్స ప్రెస్ జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్ మీదుగా నడుస్తుంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్ల పేరును ఈ రైలు ప్రయాణ మార్గం నుంచి తీసేశారు. సికింద్రాబాద్-నిజాముద్దీన్, నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా నడిపించనున్నారు.
రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో భారతీయ రైల్వే అదనపు రైళ్లను పెంచుతోంది. అయితే పెరిగిన రైళ్ల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ను నియంత్రించలేకపోతుండటంతో కొన్ని మార్గాల్లో మూడోలైను నిర్మాణం కూడా చేపడుతోంది. అందులో భాగంగానే కాజీపేట మార్గంలో ఆసిఫాబాద్-రేచ్ని మధ్య మూడోలైను పనులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications