ప్రయాణికులకు హెచ్చరిక: 2 ముఖ్యమైన రైళ్లను చర్లపల్లికి మార్చిన రైల్వే
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యామ్నాయంగా మరో రైల్వే టెర్మినల్ గా చర్లపల్లిని తీర్చిదిద్దింది. తొమ్మిది ప్లాట్ ఫామ్స్ తో అతి పెద్ద స్టేషన్ గా మార్చేందుకు రూ.450 కోట్లు ఖర్చుపెట్టింది. ఇటీవలే ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్ నుంచి పలు రైళ్లు నడుస్తుండటంతోపాటు ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి కాకుండా చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. కొన్ని ప్రధానమైన రైళ్లు ఇప్పటికే చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. మరికొన్ని రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం కూడా ఇచ్చారు.
చెన్నై సెంట్రల్ కూడా
తాజాగా సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి నడుస్తున్న రెండు కీలకమైన రైళ్లను అధికారులు చర్లపల్లికి మార్చారు. సికింద్రాబాద్ నుంచి గోరఖ్ పూర్ వరకు, గోరఖ్ పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే 12589, 12590 రైళ్లను చర్లపల్లికి మార్చారు. ఇకనుంచి ఇవి గోరఖ్ పూర్ - చర్లపల్లి, చర్లపల్లి - గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ గా పేరు మార్చుకున్నాయి.

అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ కు, చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ కు నడిచే చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా చర్లపల్లికి మార్చారు. 12604, 12603 పేరుతో నడిచే ఈ రైళ్లు ఇకనుంచి చర్లపల్లి - చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - చర్లపల్లి సూపర్ ఫాస్ట్ పేరుతో నడవనున్నాయి. ఈ నిర్ణయం ఈనెల 12, 13 తేదీల నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
రైలు పక్క ప్లాట్ ఫాంపైనే ఎంఎంటీఎస్ ను ఆపాలి
భవిష్యత్తులో మరికొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పై తీవ్ర ఒత్తిడి పడుతుండటంతో రైళ్లు సమయానికి చేరుకున్నప్పటికీ ప్లాట్ ఫామ్స్ ఖాళీలేకపోవడంతో స్టేషన్ బయటే వాటిని నిలిపివేయాల్సి వస్తోంది. ఒక్కోసారి ఒక్కో రైలుకు గంట సమయం పడుతోంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు చర్లపల్లికి మార్చడంవల్ల ఉపయోగం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు ఏర్పాటైనప్పటికీ ఎక్కే రైలు పక్కనే ఉండే ప్లాట్ ఫామ్ పైనే దాన్ని ఆపితే ప్రయోజనం ఉంటుందని, అలా కాకుండా ఎక్కడో ఒకటో, రెండో నెంబరు ప్లాట్ ఫామ్స్ లో రైలు ఉంటే ఎంఎంటీఎస్ ను ఎనిమిదో నెంబరు, తొమ్మిదో నెంబరు ప్లాట్ ఫామ్స్ లో ఆపడంవల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఎంతో ప్రయాసగూర్చి ఎక్కాల్సిన రైలు దగ్గరకు వెళ్లాల్సి వస్తోందంటూ ప్రయాణికులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications