తెలంగాణకు నైరుతి రుతుపవనాల చల్లని సంకేతాలు: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లటి సంకేతాలిచ్చాయి. జూన్ 11 నుంచి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
ఈ క్రమంలో జూన్ 22వ తేదీ నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్నిచొట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంతమేర తగ్గనుంది.

అయితే, రాష్ట్రంలో ఎండల తీవ్రత సోమవారం కూడా కొనసాగింది. పలుచోట్ల సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండం, మెదక్, భద్రాచలం ప్రాంతాల్లో సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో తీవ్రమైన వడగాలులు కూడా వీచాయి.
13 జిల్లాల్లోని 6 మండలాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
10 మండలాల్లో తీవ్రత ఎక్కువగా నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో 2 చొప్పున, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సూర్యపేట, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రమైన వడగాలులు వీచాయి. సూర్యపేట జిల్లా మునగాల మండలంలో రాష్ట్రంలోని అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన వడగాలు వీచాయి.
జూన్ 22న తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండటంతో వాతావరణం కొంత చల్లగా మారనుంది. హైదరాబాద్ నగరంతోపాటు ఇతర జిల్లాల్లో కూడా రానున్న రెండ్రోజులపాటు సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. సోమవారం కూడా హైదరాబాద్ నగరంలో ఎండ తీవ్రత కొంత తక్కువగానే ఉన్నప్పటికీ.. ఉక్కపోతతో నగరం జనం అవస్థలు పడ్డారు.












Click it and Unblock the Notifications