ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుంటున్నారా? మీకో శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే .పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దశలవారీగా ఇల్లు నిర్మాణం చేస్తున్న పేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అధికార యంత్రాంగం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పనులను స్పీడ్ అప్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకం
ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం స్థలంతో పాటు, లబ్ధిదారులకు దశలవారీగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మొదటి విడతలో ఇళ్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇళ్ళను కేటాయించడానికి ప్రభుత్వం నేరుగా అధికారులను లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు పంపి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ సమస్యల కోసం కాల్ సెంటర్
ఇంటి నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు కలుగుతున్న అనేక అనుమానాలపైన, ఒకవేళ నిధుల ఆలస్యం జరిగితే దీనిపైన సమాచారం అందడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కాల్ సెంటర్ ప్రారంభం
నేడు ఈ కాల్ సెంటర్ ను హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇక ఈ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయాలనుకునేవారు 1800 599 5991 టోల్ ఫ్రీ నెంబర్ కు చేయవలసిందిగా పేర్కొన్నారు. ప్రారంభంలో పది మంది సిబ్బంది ఈ కాల్ సెంటర్లో పనిచేస్తారు.
కాల్ సెంటర్ చేసే పని ఇదే
లబ్ధిదారుల నుండి, ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన అనేక అనుమానాలు ఉన్న సాధారణ ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, ఆ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి సమస్యల పరిష్కారానికి ఈ కాల్ సెంటర్ ద్వారా కృషి చేస్తారు. ఇక ఇదే సమయంలో ఈ ఇళ్ల పథకంలో ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే వారికి కూడా చెక్ పెట్టడానికి ఈ కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు.
సామాన్య ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ళ పథకం కాల్ సెంటర్
నేటి నుంచి అందుబాటులోకి వచ్చే ఈ సౌకర్యాన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పాటు, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకతను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే ఈ కాల్ సెంటర్ ను ప్రారంభిస్తోంది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications