ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, ఎందుకంటే?
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఇప్పటికే పూర్తి కాగా, అధికారులు ఫైనల్ రిపోర్టును సిద్ధం చేశారు. ఈ తుది నివేదికను ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు.
కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వే రిపోర్టుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి తుది నివేదికను ఆమోదం కోసం కేబినెట్‌కు పంపనుంది. ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై.. కుల గణన సర్వే నివేదికపై చర్చించి ఆమోదముద్ర వేయనుంది.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 7వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కుల గణన నివేదికపై సభలో చర్చించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ కుల గణన నివేదికకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రాజ్ భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణపై చర్చించినట్లు తెలిసింది. గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, ఫిబ్రవరి 5న జరగనున్న కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదముద్ర వేసి.. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications