పదో తరగతి పేపర్ కేసు: బండి సంజయ్ కస్టడీ పిటిషన్ డిస్మిస్, నిందితులకు బెయిల్
హైదరాబాద్: పదో తరగతి లీకేజీ కేసులో కస్టడీ, బెయిల్ దరఖాస్తులపై మంగళవారం హనుమకొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది కోర్టు.
ఈ కేసులో మరింత విచారణ నిమిత్తం ఏ1 నిందితుడు బండి సంజయ్ తోపాటు ఏ2, ఏ3 భూర ప్రశాంత్, గుండెబోయిన మహేశ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఏప్రిల్ 6న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, బండి సంజయ్ తమకు మెయిల్ మంజూరు చేయాలంటూ అరెస్టైన ఐదో తేదీన దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు కావడంతో ఆయన కస్టడీ పిటిషన్ నిష్ప్రయోజనమైంది.

ఈ నేపథ్యంలో ఐదో నిందితుడు శివగణేశ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కస్టడీ పిటిషన్లపై హనుమకొండ జిల్లా నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఇంఛార్జీ న్యాయమూర్తి, రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ షేక్ అరీఫ్ సోమవారం వాదనలు విన్నారు.
ఇక ముగ్గురు నిందితులు ప్రశాంత్, మహేశ్, శివగణేశ్ దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తులపైనా వాదనలు విన్నారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేశ్, ఏ5 శివగణేష్‌కు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు.
బండి సంజయ్ తోపాటు అరెస్ట్ అయిన మరో ముగ్గురిని కలుపుకుంటే.. మొత్తం నలుగురికి బెయిల్ మంజూరైంది. నిందితుల్లో ఒకరు మైనర్‌గా ఉన్నారు. ఆ బాలుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు పోలీసులు.












Click it and Unblock the Notifications