స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం ఖరారు, ఏ పోలింగ్ ఎప్పుడు..!?
తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. కొద్ది రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల పైన జరుగుతున్న చర్చ వేళ అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అంశం పైన ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం.. కోర్టులో విచారణ వేళ ఎన్నికల నిర్వహణ పైన ఎలాంటి నిర్ణయాలు వస్తాయనే ఉత్కంఠ కొనసాగింది. ఈ సమయంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దమైంది. మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అసలైన ఎన్నికల పోరు ప్రారంభం కానుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల కోసం ముందస్తు వ్యూహాలు అమలు చేసింది. బీసీ రిజర్వేషన్లు అమలుతో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషనర్ ఆయా శాఖల ఉన్నతా అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేసారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికలను ఆ శాఖ ఇప్పటికే ఎస్‌ఈసీకి అందజేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఈ నెల 30లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్‌ఈసీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే 30న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఉండటంతో.. ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేయాలని ఎస్‌ఈసీ నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకుగాను ఇప్పటికే ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఎస్‌ఈసీ నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియను వేగంగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్‌ఈసీ కూడా ఇందుకు అనుగుణంగానే చర్యలు మొదలు పెట్టింది. గతంలో మాదిరిగా మూడు దశల్లో లేదంటే రెండు దశల్లో ఎన్నికలు ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేసే ఛాన్స్ ఉంది.
దీంతో.. రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేయడమే కాకుండా.. ఎన్నికల విధుల కోసం సిబ్బంది నియామకం, శిక్షణ వంటివి ఇప్పటికే పూర్తిచేశారు. ఇక పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామగ్రిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సోమవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే.. రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొనేలా ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని ఎన్నికల సంఘం సిద్దం చేసింది. దీంతో, రాజకీయంగానూ ఇక పరిణామాలు కీలకంగా చోటు చేసుకోనున్నాయి.












Click it and Unblock the Notifications