మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!
ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది వీకెండ్ టూరిజానికి అలవాటు పడ్డారు. వీక్ మొత్తం పనుల్నో నిమగ్నమై వీకెండ్ లో ఎంజాయ్ చేసేందుకు ఇష్ట పడుతున్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అనేక టూరిస్టు ప్రాంతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఓ వైపు చారిత్రక కట్టడాలతో పాటు ప్రకృతి రమణీయమైన సహజసిద్ధమైన టూరిస్టు స్పాట్స్ కూడా ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ స్పాట్స్ లో కొన్నింటి వివరాలు చూస్తే..
ఆంధ్రా కాశ్మీర్ గా పేరుగాంచిన లంబసింగి అందాలు చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అందమైన పర్వతాలు.. కనుచూపుమేరా పచ్చని తివాచీలు పరిచినట్టు ఇక్కడి దృశ్యాలు కనువిందు చేస్తాయి. లంబసింగి సముద్రమట్టానికి సుమారు 4వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. లంబసింగిలో తాజంగి జలాశయం,కొత్తపల్లి వాటర్ ఫాల్స్,చెరువులవేనం చూడదగ్గ ప్రదేశాలుగా ఉన్నాయి.
ప్రకృతి ప్రేమికులకు భూతల స్వర్గంగా అరకు లోయ ఉంది. అరకు ప్రాంతాన్ని ఆంధ్రా ఊటీ గా పిలుస్తుంటారు. అరకు ప్రయాణం ఓ అద్భుతంలా ఉంటుంది. ఇక్కడ బొర్రా గుహలు, చాపరాయ జలపాతం అందాలు, పచ్చని ప్రకృతి మధ్య మనల్ని మనమే మరిచిపోయేంత అనుభూతిని కలిగిస్తాయి.
అనంతగిరి కొండలు ఆహ్లాదానికి చిరునామాగా నిలుస్తున్నాయి. అనంతగిరిని 'తెలంగాణ ఊటీ' గా పిలుస్తారు. వికారాబాద్ నుంచి 10కిలోమీటర్ల దూరంలో ఈ కొండలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ప్రకృతి, చారిత్రక, వారసత్వ కట్టడాలకు నెలవైన అనంతగిరి అటవీ ప్రాంతాన్ని వేలాది మంది సందర్శిస్తారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం వికారాబాద్‌కు సమీపంలో 3750 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఎత్తయిన కొండలు, దట్టమైన చెట్ల మధ్య పద్మనాభ స్వామి ఆలయం కొలువై ఉంది.

ఇక తెలంగాణ కాశ్మీర్ గా పిలుచుకునే ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి రమణీయతను ఎంత చెప్పినా తక్కువే.. ఇక్కడి జలపాతాలు, చారిత్రక ప్రదేశాలు పర్యటకులకు ఆకర్షిస్తున్నాయి. కుంటాల, సప్తగుండాల జలపాతాలతో పాటు చారిత్రక ప్రదేశమైన గోండు రాజుల కోట ఇక్కడ మనకు కనువిందు చేస్తాయి. అలాగే పొచ్చర, కనకాయి జలపాతాలను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.












Click it and Unblock the Notifications