ఇరుకు బస్తీల్లో మురికి జీవితాలకు స్వస్తి.!జబర్దస్దుగా ఉండేందుకే డబుల్ బెడ్ రూం ఇండ్లన్న మంత్రులు.!
హైదరాబాద్ : పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర గృహనిర్మాణ, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మ నగర్ లో 27.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలు, ఇంటి తాళాలను అందజేశారు.

లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు.. తలసానికి, ప్రశంత్ రెడ్డికి బస్తీ వాసుల ఘన స్వాగతం
ముందుగా మంత్రులు లబ్ధిదారులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అంతకు ముందు మంత్రులకు కాలనీ వాసులు డప్పుచప్పుళ్ళు, బాణసంచాలతో ఘనస్వాగతం పలికారు. మహిళలు కుంకుమ తిలకం దిద్ది మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మురికి కూపాలను తలపించేలా ఉన్న బస్టిలలో సరైన వసతులు లేక ఇరుకు ఇండ్లలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లను నిర్మించి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు.

ఒకప్పుడు మురికి బస్తీలు.. ఇప్పుడు అధునాతన రెండు గదుల ఇండ్లన్న మంత్రులు
దేశంలో ఎక్కడా లేని విధంగా లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే ఉచితంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యవేక్షణలో నగరంలో లక్ష ఇండ్లు నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటికే 60 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, అందులో 23 ప్రాంతాలలో ఇండ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు చెప్పారు. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే 7 ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు.

పేద ప్రజలు సంతోషంగా ఉండాలి.. అదే సీఎం కల అన్న మంత్రులు
పేద ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరుకుంటారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తాను ఇక్కడే పెరిగానని, మీ సాధక బాధకాలు తెలిసిన వాడినని అన్నారు. మీ కష్టాలను దూరం చేయాలని, మీరు సంతోషంగా ఉండాలనే విశాలమైన అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు తలసాని చెప్పారు.

డబ్బులిచ్చి నష్టపోవద్దు.. అందరికి ఉచితంగానే ఇస్తామన్న తలసాని
ఇండ్ల నిర్మాణం చేపట్టే ముందు కొంతమందికి అనుమానాలు ఉండేవని, కానీ తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఇండ్లను నిర్మించి అనుమానాలను పటా పంచలు చేసినట్లు తెలిపారు. ఈ బస్తీలో ఎంతో కాలం నుండి నివసిస్తున్న అర్హులైన వారిని బస్తీ ప్రజల సమక్షంలో బహిరంగంగా గుర్తించి వారందరికీ ఇండ్లను ఇస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఎవరో ఏదో చెబితే వారి మాటలు నమ్మి డబ్బులిచ్చి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు. కాలనీ ప్రజల కోసం ఒక బస్తీ దవాఖాన, ఒక అంగన్ వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.