
కాంగ్రెస్ లో చేరికలతుఫాన్ రాబోతోందా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అదేనా? జోరుగా చర్చ!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొద్దికొద్దిగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీలోకి చేరికలతో పార్టీలో కొత్త జోష్ ను తీసుకురావడానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా నుండి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు, దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి కాంగ్రెస్ పార్టీపై కేంద్రీకృతమైంది.

కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుఫాను.. రేవంత్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ
ఇక ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని, కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుఫాను రాబోతోందని టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఆసక్తికర చర్చకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు దీనిపై చర్చ జరుపుతున్నాయి.

కారు దిగే వారికి కార్పెట్ వేస్తున్న రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పై పార్టీలో అంతర్గతంగా తీవ్రస్థాయిలో అసమ్మతి కనిపిస్తుంది. చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు, పార్టీలో తమకు ప్రాధాన్యం లేదని పక్క చూపులు చూస్తున్నారు. ఓవర్ లోడ్ అయిన టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు రావాలి అని భావిస్తున్న వారి చర్యలపై దృష్టి పెట్టి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలి అని భావిస్తున్నవారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీలో ఉన్న రాజకీయాలు పార్టీలో చేరాలనుకునే వారిని పునర్ ఆలోచించేలా చేస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బీజేపీలో చేరాలనుకున్నా కాంగ్రెస్ లో చేరిక .. ఎలాగంటే
ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మొదట బీజేపీలో చేరాలని భావించారు. కానీ పార్టీలో పరిస్థితిని గమనించిన ఆయన, రేవంత్ రెడ్డితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అటు టీఆర్ఎస్ పై పెరుగుతున్న అసమ్మతి, ఇటు బిజెపిలో అంతర్గతంగా ఉన్న ఇబ్బందులు వంటి పరిస్థితులను అడ్వాంటేజ్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదును చూసి బయటకు రావాలనుకుంటున్న నేతలను హస్తం బాట పట్టిస్తున్నారు. ఇక తాజాగా తాటి వెంకటేశ్వర్లు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

టీఆర్ఎస్ అసంతృప్తులతో టచ్ లోకి రేవంత్ రెడ్డి .. ఆరా తీస్తున్న టీఆర్ఎస్, బీజేపీ
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పునర్వైభవం తీసుకు రావాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ముందే భారీగా చేరికలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తమ పార్టీలోకి ఎవరు చేరుతున్నారు? ఎవరు తనకు టచ్లో ఉన్నారు అన్న విషయాలు కూడా బయటకు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అనేక జిల్లాలో ఇప్పటికే టీఆర్ఎస్ అసంతృప్తులతో రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన భవిష్యత్తులో చేరికల తుఫాన్ రాబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అటు అధికార టీఆర్ఎస్, బిజెపి పార్టీలు రేవంత్ మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నదానిపై ఆరా తీస్తున్నారు. రేవంత్ రెడ్డి కి ఎవరెవరు టచ్ లో ఉన్నారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.