ఫీజు కట్టాలంటూ ఒత్తిడి: మూడో అంతస్తు నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్యయత్నం
హైదరాబాద్: నారాయణ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్ధి ఫీజు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరుపేట సమీపంలోని నారాయణ ఐఐటీ స్పార్క్ అకాడమీలో ఆదివారం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వరంగల్ జిల్లాకు చెందిన పవన్ నాయక్(17) ఈ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కాలేజీ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి విద్యార్ధులు అతడిని వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ నాయక్ పరిస్థితి నిలకడగా ఉందని, కానీ రెండు కాళ్లు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు ఆదివారం కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టాయి.

విద్యార్ధి ఆత్మహత్యయత్నానికి యాజమానిదే బాధ్యత అంటూ నినాదాలు చేశారు. విద్యార్ధుల నుంచి పెద్ద మొత్తంలో కాలేజీ యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తోందని మండిపడ్డారు. కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు కళశాల ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనపై విద్యార్ధి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ స్తోమతకు మించి ఈ కాలేజీలో చేర్పించామన్నారు. కాలేజీలో చేరేటప్పుడు ఒక ఫీజు చెప్పిన యాజమాన్యం, చేరిన తర్వాత ఫీజుని పెంచారంటూ చెప్పారు. అయినా సరే త్వరలోనే ఫీజు డబ్బులు కడతామని చెప్పిన తమ కుమారుడిపై ఒత్తిడిని తీసుకొచ్చారని తెలిపారు.
ఆ ఒత్తిడిని తట్టుకోలేకే తమ కుమారుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడన్నారు. కాలేజీ యాజమాన్యం మాత్రం తామెలాంటి అధిక ఫీజులను వసూలు చేయడం లేదని పేర్కొనడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications