కెసిఆర్‌కు సుచరితా రెడ్డి లేఖ: తుమ్మలకు విపక్షాలు షాకిస్తాయా?
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును కోరారు. ఈ మేరకు ఆమె కేసీఆర్‌కు లేఖ రాశారు.సానుభూతితో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమకు మద్దతు తెలిపాయని ఆమె గుర్తు చేస్తూ పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిపై పునరాలోచించాలని సుచరితారెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటవుతున్నాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరితా రెడ్డి పోటీకి దించుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. సుచరితకు మద్దతు ఇస్తామని గతంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, ఆదివారం టిడిపి కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది.

దీంతో గత ఎన్నికల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒకే బాట పట్టాయి. గత ఎన్నికల్లో 44వేల ఓట్లు సాధించిన సిపిఎం మద్దతు కూడా పొందేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పలుమార్లు చర్చించిన కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వామపక్షాల మద్దతుపై ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే జరిగితే అధికార పార్టీకి వ్యతిరేకంగా అన్ని ప్రధాన పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చినట్లు అవుతుంది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ఎన్నికలు జరిగినప్పటికీ ఎప్పుడూ ప్రత్యర్థులంతా ఒకే తాటిపైకి రాలేదు. పాలేరు ఉప ఎన్నిక దానికి నాంది అవుతుందని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో కేవలం 4వేల ఓట్లు మాత్రమే సాధించిన టిఆర్‌ఎస్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అత్యంత బలమైన పార్టీ గా అవతరించింది. ఇందుకు తుమ్మల వ్యూహ మే ప్రధాన కారణంగా చెప్తున్నారు.












Click it and Unblock the Notifications