రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. బాధిత కుటుంబానికి సీఎం రేవంత్ సాయం
ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా జరిపిన భారీ క్షిపణి దాడుల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఉపాధి కోసం ఉక్రెయిన్ వెళ్లిన సుదర్శన్.. తాను నివసిస్తున్న గది నుంచి బయటకు రాగా క్షిపణి దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఉక్రెయిన్ పై రష్యా జరిపిన ఈ దాడుల్లో సుదర్శన్ తో పాటు మరో 11 మంది కూడా మరణించారు. ఇక సుదర్శన్ తో పాటు ఉక్రెయిన్ లోనే ఉంటున్న తాటిపల్లి గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి .. ఈ సమాచారాన్ని సుదర్శన్ కుటుంబ సభ్యులకు చేరవేర్చాడు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఉపాధి కోసం నాలుగు నెలల క్రితమే ఉక్రెయిన్ కు వెళ్లిన సుదర్శన్ గౌడ్.. డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

సీఎం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఈ ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పై హౌతీ దళాలు జరిపిన క్షిపణి దాడుల్లో తెలంగాణ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుడు హైదరాబాద్ కు చెందిన మీర్ మహమ్మద్ యూసుఫ్ అలీ అని తేలింది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications
