ఫలించని సుజనా మంతనాలు: సున్నితంగా తిరస్కరించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రచారంలో దించడానికి మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైనట్టు తెలిసింది. గత వారంలో గ్రేటర్ ఎన్నికల విషయాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించిన టీడీపీ నేతలకు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.
తాజాగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. మంగళవారం సుజనా చౌదరి గ్రేటర్ ఎన్నికల ప్రచార విషయమై పవన్ కళ్యాణ్‌తో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం తాను సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేనని చెప్పి సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం.

కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సింగపూర్‌లో జరుపుకుంటోంది. మొదట నుంచి కూడా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. దీనికి తోడు ఆయన అభిమానులు, అనుచరులు గ్రేటర్ ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ స్థాయికి తగదని చెప్పడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల బరిలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 100 పైగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రులు జోగురామన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు అన్నారు.












Click it and Unblock the Notifications