సుజనా చౌదరికి మరో షాక్: 'రుణాల ఎగవేత'లో కోర్టుకు రావాల్సిందే
హైదరాబాద్: మారిషస్ బ్యాంకును మోసగించిన కేసులో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రి సుజనా చౌదరిని నాంపల్లి కోర్టు శనివారం నాడు ఆదేశించింది. కోట్లాది రూపాయల రుణాల తీసుకొని చెల్లించడం లేదని సుజనా ఇండస్ట్రీస్ పైన మారిషస్ బ్యాంకు అధికారులు గతంలో కేసు పెట్టారు.
సంస్థ ఎండీ శ్రీనివాస రాజుతో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న కేంద్రమంత్రి, టిడిపి ఎంపీ సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు గత నెల 20వ తేదీన సమన్లు పంపించింది. మార్చి 5న విచారణకు రావాలని పేర్కొన్నప్పటికీ.. సుజనా హాజరు కాలేదు.
సుజన తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరై నిందితులు హైదరాబాదులో లేరని తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు సుజనా చౌదరి, ఎండీ శ్రీనివాస రాజు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అనంతరం విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, రెండు రోజుల క్రితం సుజనకు సుప్రీం కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. మారిషస్ రుణాల బకాయి చెల్లింపు విషయంలో కింది కోర్టు విధించిన ఆరు నెలల గడువును పెంచాలని హైకోర్టులో ఆయన సంస్థలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
గడువు పెంపునకు నిరాకరించిన హైకోర్టు సుజనాకు షాకిస్తూ ఆరు నెలల గడువును మరో నెల కుదిస్తూ ఐదు నెలల గడువునే విధించింది.
హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుజనా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గడువు పెంచాలన్న తన అభ్యర్థనను మన్నించకపోగా.. గడువును కుదించడమేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు తీర్పు సరైనదేనని పరోక్షంగా చెప్పిన సుప్రీం ధర్మాసనం సుజనా పిటిషన్‌ను కొట్టేసింది.












Click it and Unblock the Notifications