హైదరాబాద్‌లో సన్‌బర్న్ కార్యక్రమం రద్దు: నిర్వాహకుడు సుమంత్‌పై కేసు
హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో నిర్వహించతలపెట్టిన సన్‌బర్న్ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్ కు సంబంధించి బుక్‌మై షోలో టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమతి తీసుకోకుండా టికెట్లు విక్రయించినందుకు ఇప్పటికే బుక్‌మై షో, నోడల్ అధికారులకు నోటీసులిచ్చారు. ప్రస్తుతం బుక్‌మై షోలో సన్‌బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ కనిపించడం లేదు. విశాఖపట్నం వేదికగా జరగబోయే సన్ బర్న్ ఈవెంట్ టికెట్లు మాత్రం విక్రయిస్తున్నారు. అనుమతి తీసుకోకుండానే హైదరాబాద్ ఈవెంట్ కు సంబంధించిన టికెట్లు విక్రయించడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతులు రాకుండా బుక్ మై షో టికెట్లు విక్రయిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మండిపడ్డారు. దీంతో పోలీసులు బుక్‌మై షో నిర్వాహకులపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం పోలీసుల అనుమతి తప్పని సరిగా ఉండాలని గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని తేల్చిచెప్పారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మహంతి స్పష్టం చేశారు.
కాగా, సన్‌బర్న్ అనేది భారీ సంగీత వేడుక. దేశంలోని అనేక రాష్ట్రాల్లో సన్‌బర్న్ ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదనుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయనే ఆరోపణలున్నాయి. ఈసారి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబరు 31వ తేదీన మాదాపూర్‌లో సన్‌బర్న్ పేరుతో ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. తాజాగా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో కార్యక్రమాన్నిరద్దు చేసుకున్నారు నిర్వాహకులు.












Click it and Unblock the Notifications