టీ కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కాలంటే : ఆ నివేదికే కీలకంగా : ఆశావాహుల్లో కొత్త టెన్షన్..!!
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త కీలకంగా మారారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలాగైనా అనకూలంగా మలచుకోవాలనే వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి రావాలనే పట్టుదల తో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం టీపీసీసీ చీఫ్ గా రేవంత్.. రాజకీయ వ్యూహకర్తగా సునీల్ కనుగోలుకు బాధ్యతలు అప్పగించింది. దీంతో సునీల్ తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గం పైన ఫోకస్ చేసారు. గతంలో కాంగ్రెస్ లో లాబీయింగ్ తో టిక్కెట్లు దక్కేవి. ఇప్పుడు మాత్రం అధినాయకత్వం పూర్తిగా ఆ విధానం మార్చేసింది.

వారికే పార్టీ టిక్కెట్లు..సిఫార్సులు చెల్లవ్
తెలంగాణలో పని చేసే నేతలు.. నియోజకవర్గాల్లో ఉండే నేతలకే టిక్కెట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా.. సునీల్ ఇచ్చే నివేదికలు కీలకం కానున్నాయి. ఇందులో భాగంగా సునీల్ టీం ప్రతీ నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ ఖాయమని నమ్మకం పెట్టుకున్న వారిలో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. కాంగ్రెస్ లో నిత్యం కనిపించే కోల్డ్ వార్ పైనా సునీల్ తన నివేదికలను ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి అందిస్తున్నట్లు సమాచారం. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై ఇప్పటికే సర్వే పూర్తి చేసి నివేదిక సైతం అందచేసినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది.

సునీల్ నివేదికలే ప్రామాణికంగా
ప్రత్యేకించి పార్టీ కొన్ని వర్గాల మద్దతు బలంగా ఉందని భావిస్తున్న జిల్లాల్లోనే నేతల మధ్య విభేదాలు నష్టం చేసేవిగా ఉన్నాయని నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీలో జిల్లాల వారీగా నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గ్రూప్ రాజకీయాలు, వాటిని ప్రోత్సహిస్తున్న నేతల పైన పూర్తి సమాచారం సేకరించారని సమాచారం. ఈ నివేదికలు పార్టీ నేతల కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ప్రభావం చూపనున్నాయి. కొందరు సీనియర్లు ఇప్పటికీ రేవంత్ నియమాకం పైన అంత సానుకూలంగా లేరు. పరోక్షంగానే అనేక వ్యాఖ్యలు.. జిల్లాల్లో అనుచరులతో మంతనాలు చేస్తున్నారు. అయితే, వీరిందరిపైనా చర్చలు తీసుకోవటం కంటే..వారిని దారిలోకి తెచ్చుకోవటం పార్టీకి మంచిదనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్రిముఖ పోరులో లాభపడేదెలా
పార్టీ పైన నమ్మకం - విధేయతతో ఉండే నేతలు..ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిష్కరించే బాధ్యత పార్టీ తీసుకుంటోంది. అందుకోసం సునీల్ ఇచ్చే నివేదిక ఆధారంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల పైన చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు కాంగ్రెస్ లో సునీల్ కొనుగోలు ప్రాధాన్యత కీలకంగా మారుతోంది. టీఆర్ఎస్ - బీజేపీ పోరులో కాంగ్రెస్ లాభపడేందుకు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన ఒక రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు చెబుుతున్నారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వ్యూహకర్తగా ఉన్న సునీల్ హైకమాండ్ కు ఇచ్చే నివేదికలు..ఇక్కడ నిర్ణయాలపైన ప్రభావం చూపుతున్నాయి.












Click it and Unblock the Notifications