SRH VS CSK: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: అభిమాన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా క్రికెట్ ప్రేమికులు చేరుకున్నారు. ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా స్టేడియానికి వచ్చారు.
క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే ఉద్దేశంతో అభిమానులు స్టేడియానికి బారులు తీరారు. ఈ క్రమంలో స్టేడియానికి చేరుకున్న క్రికెట్ అభిమానులు టికెట్లు ఉన్న లోపలికి అనుమతించడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉప్పల్ స్టేడియంలోని గేట్ నంబరు 4 వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గేట్ దగ్గర ఉన్న బారికేడ్లను తోసేసిన అభిమానులు ఒక్కసారిగా గేట్లు తెరుచుకుని లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇక్కడ పోలీసులకు, ప్రేక్షకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు సిబ్బంది ఒక్కొక్కరిని గేటు ద్వారా లోపలికి పంపించారు. కాగా, ఉప్పల్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి అదనంగా గంటపాటు మెట్రో రైళ్లు ఈ మార్గంలో నడవనున్నాయి. మరోవైపు, టీఎస్‌ఆర్టీసీ కూడా మ్యాచ్ కోసం ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. హైదరాబాద్ అభిమానులతోపాటు ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. ఎక్కువ సంఖ్యలో అభిమానులు చెన్నై జెర్సీలను ధరించి సందడి చేశారు.












Click it and Unblock the Notifications