సుప్రీంకోర్టులో కవిత ఎమర్జెన్సీ పిటీషన్- కుదరదన్న సీజేఐ చంద్రచూడ్ బెంచ్..!!
బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఇవ్వాళ సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ విచారణను నిలిపివేయాలని కోరారు. ఈ పిటీషన్ ఈ నెల 24వ తేదీకి లిస్టింగ్ అయింది.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇవ్వాళ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు వ్యతిరేకంగా పిటీషన్ వేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ చేసింది. ఆ రోజున విచారిస్తామని తెలిపింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ సారథ్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కవిత పిటీషన్ ను విచారించనుంది. ఇప్పటికిప్పుడు ఈడీ విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ విషయంలో కవిత చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున దాన్ని నిలిపివేయాలని ఆదేశించలేమని తెలిపింది.
కవిత దాఖలు చేసిన పిటీషన్ ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆమె తరఫు న్యాయవాది వందన సెహెగల్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒక మహిళను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవడం సరికాదని అన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు ఈ నెల 11వ తేదీన గంటల తరబడి ప్రశ్నించారని గుర్తు చేశారు.

కవిత, ఆమె తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ దాడులు సాగుతున్నాయని అన్నారు. వారిద్దరూ తమకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తోన్నందు వల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఈడీతో విచారణ జరిపిస్తోందని కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీన్ని అత్యవసర పిటీషన్ గా స్వీకరించడానికి సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం అంగీకరించలేదు. ఈ నెల 24వ తేదీన విచారణ జరుపుతామని పేర్కొంది.
కవిత నివాసానికి బదులుగా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించడంలో అర్థం లేదని అడ్వొకేట్ వందన సెహెగల్ పేర్కొన్నారు. తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించడం క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకమని వాదించారు. క్రిమినల్ ప్రొసీజర్ లోని సెక్షన్ 160కి సంబంధించిన ప్రొవిజన్ ను ఉల్లంఘించినట్టయిందని అన్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో కవిత పేరు లేకపోయినప్పటికీ-, కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార రాజకీయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని అడ్డుగా పెట్టుకుని ఆమెపై రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తోన్నారని అన్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని అన్నారు. అత్యవసర విచారణ కింద ఈ పిటీషన్ ను విచారించలేమని, ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ చేసినట్లు బెంచ్ తెలిపింది.












Click it and Unblock the Notifications