ఓటుకు నోటు విచారణ.. మత్తయ్య కలిసేందుకు అనుమతివ్వండి.. డీజీపీకి సుప్రీం ఆదేశం
ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్యకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ తెలంగాణ డీజీపీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈకేసులో ఏపీ, తెలంగాణ పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ మత్తయ్య సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆయన తరపు న్యాయవాది సిద్దార్థ్ దవే కోర్టుకు పలు అంశాలు నివేదించారు. మత్తయ్యకు సెక్యూరిటీ కల్పించాలని గతంలో కోర్టు చెప్పినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. డీజీపీ అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని, ఆయనకు ప్రాణహాని ఏమి లేదంటూ నివేదిక ఇచ్చారని తెలిపారు. దీంతో మత్తయ్యకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ డీజీపీని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది.
మరోవైపు ఓటుకు నోటు కేసులో తనను ఇంప్లీడ్ చేయాలంటూ మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. ఆయన తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్దార్థ లుత్రా.. తెలంగాణ ఏసీబీ తరపు లాయర్ రావల్ మధ్య వాదనలు జరిగాయి.

ఈ కేసుకు సంబంధించి తనను ఇంప్లీడ్ చేయాలని ఉదయసింహ పిటిషన్ వేయడాన్ని ఏసీబీ లాయర్ తప్పుబట్టారు. కేసులో ఆలస్యం జరగడానికే ఇలాంటి పిటిషన్లంటూ ఆరోపించారు. ఇరువురు లాయర్ల మధ్య వాదనలు ముదరడంతో సంయమనం పాటించాలని న్యాయమూర్తులు సూచించారు. అయితే ఉదయసింహ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు ధర్మాసనం.












Click it and Unblock the Notifications