మంత్రివర్గ విస్తరణ వేళ ఢిల్లీ మార్క్ నిర్ణయాలు- లిస్టు ఫైనల్..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మంత్రివర్గ విస్తరణకు ముమూర్తం ఫిక్స్ కావ టంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే అయిదుగురు పేర్లు ఖరారైనట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. తమకు అవకాశం ఇవ్వాలంటూ సీనియర్లు ఢిల్లీలో హైకమాండ్ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు లో రేవంత్ ఛాయిస్ పైన స్పష్టత వచ్చింది. దీంతో, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఖరారు వేళ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
విస్తరణకు సిద్దం
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఆరు స్థానాలు ఖాళీ గా ఉండటంతో.. అయిదు స్థానాలు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ కూర్పు పైన ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా సీనియార్టీకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పదవుల పైన ఆశలు పెట్టుకున్న నేతలు ఢిల్లీ బాట పట్టారు. పార్టీ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మంత్రివర్గ కూర్పులో రేవంత్ మాటకు విలువ ఇస్తూనే.. హైకమాండ్ తుది నిర్ణయ తీసుకుంటోంది. దీంతో, తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

చివరి ప్రయత్నాలు
మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం ఉంటుందని భావించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తో సహా మరి కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే కొత్త మంత్రులుగా ప్రధానంగా సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మీర్‌అలీఖాన్, బాలునాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సామాజిక వర్గాల వారీగానూ తుది కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు గా పార్టీ - ప్రభుత్వ పదవుల ఖరారు పైన ఫోకస్ చేయటంతో నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసారు. పార్టీ కోసం కష్టనష్టాలను ఎదుర్కొని జెండా మోసిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదే విధంగా పార్టీలో పరిస్థితుల పైన ఢిల్లీ నేతలకు వివరిస్తున్నారు.
తుది కసరత్తు
దీంతో, మంత్రివర్గ విస్తరణతో పాటుగా ఒకరిద్దరు మంత్రుల పైన వేటు వేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రస్తుత మంత్రులను కొనసాగిస్తే...ఎలాంటి సంకేతాలు వెళ్తాయ నే అంశం పైన తర్జన భర్జన పడుతున్నారు. దీంతో, మంత్రుల తొలిగింపు పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే.. మంత్రుల శాఖల్లో మాత్రం మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. విద్యా, హోం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. వీటితో పాటుగా అదనపు శాఖలు నిర్వహిస్తున్న పలువురు మంత్రుల పోర్టుఫోలియోల్లోనూ కోత పడే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న తుది కసరత్తు పైన కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications