టీడీపీ కట్టిన ఆ కరకట్టే భద్రాచలాన్ని కాపాడింది-గోదావరి వరద గ్రామాల్లో చంద్రబాబు కామెంట్స్
గోదావరి వరద బారిన పడిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా ముంపుకు గురైన ఈ ప్రాంతాల్లో ప్రజల్ని స్వయంగా కలుసుకుని వారి బాధల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గోదావరి ముంపు గ్రామాల్లో చంద్రబాబు ఇవాళ పర్యటించారు. నిన్న ఏపీ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో పర్యటించి సాయంత్రానికి భద్రాచలం చేరుకున్న చంద్రబాబు.. రాత్రికి అక్కడే బస చేసి ఉదయం సీతారామాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరద అన్ని ప్రాంతాల్ని ముంచెత్తినా భద్రాచలం పట్టణాన్ని మాత్రం ముంచలేదని, దీనికి రెండు దశాబ్దాల క్రితం టీడీపీ ప్రభుత్వం కట్టిన కరకట్టే కారణమని చంద్రబాబు గుర్తుచేశారు.

భద్రాచలానికి ఉన్న గోదావరి పరద ముప్పును దృష్టిలో ఉంచుకుని 20 ఏళ్ల క్రితం తాము ఈ కరకట్టను నిర్మించామని, ఇప్పుడు భారీ వరదల్ని సైతం తట్టుకుని అది భద్రాచలం పట్టణాన్ని కాపాడిందన్నారు. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా దాన్ని అప్పట్లో నిర్మించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఈసారి వరద కరకట్ట పై వరకూ వచ్చిందని, భవిష్యత్తులో భద్రాచలం పట్టణంలోకి వరద రాకుండా దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. అలాగే భద్రాచలం పక్కనే ఉన్న ఐదు ముంపు గ్రామాలకు నష్టం వాటిల్లకుండా శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు కోరారు. అనంతరం ఆయన మిగిలిన గ్రామాల్లో బాధితుల పరామర్శకు తరలివెళ్లారు.

రెండవ రోజు భద్రాచలం మండలంలోని కుక్కునూరు, ఏలేరు పాడులో ముంపుకు గురైన వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు వెంట మాజీ మంత్రులు కె.ఎస్ జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత , చింతకాయల చిన రాజప్ప ఉన్నారు.












Click it and Unblock the Notifications