కేసీఆర్ లో జాతీయత - నిజాయితీ లేవు : ఉడత పులి అవ్వదు - టీడీపీ నేతల సంచలనం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన పైన తెలుగు దేశం సీనియర్ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ జాతీయ పార్టీగా కొనసాగించాలని దసరా నాడు కేసీఆర్ ప్రకటన చేసారు. దీని పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన కోరగా ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు. ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు.. సీనియర్ నేత గోరంట్లు బుచ్చయ్య చౌదరి రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ జాతీయ పార్టీగా ప్రకటించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

నాడు సెంటిమెంట్..నేడు ఇలా
జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, కానీ గుర్తింపు దక్కాలంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న బలం, సాధించిన ఓట్ల శాతాన్ని ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుందని వివరించారు. కేసీఆర్ కు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీతో .. మరి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పొత్తు ఎలా కుదురుతుందో అర్దం కావటం లేదని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఏపీలో ఆ పార్టీకి స్థానం లేదన్నారు. రాష్ట్ర విభజన..సీమాంధ్ర ప్రజల కష్టాలు వంటి వాటితో ఏపీలో బీఆర్ఎస్ మనుగడ ఉండదని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా టీఆర్ఎస్ బయట పడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టారని..ఇప్పుడు అవసరం లేకపోవటంతో పార్టీ పేరు మార్చేశారని గోరంట్లు బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

ఉడతకు పులి అని పేరు పెడితే
పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇదే అంశం పైన స్పందించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించినా ఆయనలో జాతీయత - నిజాయితీ లేవని అశోక్ బాబు పేర్కొన్నారు. కేసీఆర్ ను ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుందేమో కానీ, ఆంధ్ర ప్రదేశ్ స్వాగతించదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి.. ఆర్దికంగా దెబ్బ తీసారని చెప్పుకొచ్చారు. ఉడతకు పులి అని పేరు పెడితే అది పులి అయిపోదని.. జాతీయ పార్టీగా మారే అవకాశం ఉన్నంత మాత్రాన జాతీయ పార్టీ కాదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను కేసీఆర్ మోసం చేయటం ద్వారా కేసీఆర్ లో నిజాయితీ లేదనే విషయం అర్దమైందని అశోక్ బాబు పేర్కొన్నారు.

కేసీఆర్ లో నిజాయితీ లేదంటూ
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని..కుటుంబ సభ్యులతో కలిసి సోనియాతో ఫొటో దిగారని గుర్తు చేసారు. బయటకు వచ్చినాక ఏం చేసారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ వస్తే దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్ తానే సీఎం అవ్వలేదా అని ప్రశ్నించారు. కుమారస్వామి సహా ఏ పార్టీ బీఆర్ఎస్ లో విలీనానికి అంగీకరించనప్పుడు అది జాతీయ పార్టీ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. కొత్త పార్టీలు కలిస్తేనే ప్రాధాన్యత ఉంటుందని..బీఆర్ఎస్ ఆవిర్భావంలో అది కనిపించలేదని అశోక్ బాబు విశ్లేషించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.