సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్‌ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు.
మరోవైపు, ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్ ను ఏర్పాటు చేస్తోంది. ఆ హెలికాప్టర్ రాగానే సీఎం పర్యటన యధావిధిగా కొనసాగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది భారత్ రాష్ట్ర సమితి. ప్రచారంలోనూ దూసుకుపోతోంది.

రోజుకు రెండు మూడు బహిరంగ సభలతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.
అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రచారాలు చేస్తుండగా.. పార్టీ అధినేత ప్రజా ఆశీర్వాద సభలో పేరిట అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలకు హాజరవుతున్నారు.
సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్‌ల్లో నిర్వహించే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మొదటగా దేవరకద్ర సభలో పాల్గొననున్న సీఎం.. తర్వాత గద్వాల, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు హాజరవుతారు. కేసీఆర్ పర్యటనతో ఆ పార్టీ నేతలు నేతలు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. భారీగా జనం తరలివస్తున్నారు.












Click it and Unblock the Notifications