రాజన్న బిడ్డ ఆధార్, ఓటర్ కార్డు ఎక్కడున్నాయ్.. స్థానికతపై వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన తీన్మార్ మల్లన్న !!
తెలంగాణా రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టగా, తాజాగా గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి హోరాహోరీగా పోరాడి ఓటమిపాలైన తీన్మార్ మల్లన్న కూడా సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెలాఖరు నుంచి తీన్మార్ మల్లన్న టీం ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్టు పాదయాత్ర కార్యాచరణను ప్రకటించారు. ఇదే సమయంలో వైయస్ షర్మిల ను టార్గెట్ చేసిన తీన్మార్ మల్లన్న ఆమె స్థానికతపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Recommended Video

వైఎస్ షర్మిల స్థానికత టార్గెట్ గా తెలంగాణా రాజకీయాలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైయస్సార్ వారసురాలిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన, వైయస్ షర్మిల అధికార టీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షాల పై కూడా ఆమె మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రధాన పార్టీలకు ధీటుగా ముందుకు సాగుతున్న షర్మిలను స్థానికత పేరుతో టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనికి సమాధానంగా షర్మిల తెలంగాణ నా గడ్డ... ఇది నా రియాలిటీ అంటూ బలంగా తన స్వరాన్ని వినిపిస్తున్నారు.

రాజన్న బిడ్డ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్న
ఇదే సమయం లో తీన్మార్ మల్లన్న ఆమె స్థానికతపై షర్మిలను టార్గెట్ చేస్తూ వేసిన ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రజలు అంటే , తెలంగాణ ప్రాంతం అంటే తనకు అభిమానం, ఆదరణ , తెలంగాణ అంటే తనకు ప్రేమ ఉందని చెప్పుకుంటున్న రాజన్న బిడ్డ వైయస్ షర్మిల తన ఆధార్ కార్డ్, తన ఓటర్ ఐడీ కార్డు ఎక్కడుందో చెప్పాలని తీన్మార్ మల్లన్న సవాల్ చేశారు. తెలంగాణ నా గడ్డ అని చెప్పుకుంటున్న వైయస్ షర్మిలకు పులివెందులలో ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉన్నాయని తన ఓటు హక్కును తాను పులివెందులలో వినియోగించుకుంటున్నారని తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేశారు.

తెలంగాణా మీద ప్రేముంటే పులివెందులలో ఓటేస్తావా చెల్లీ అంటూ మల్లన్న ఎద్దేవా
తెలంగాణపై ప్రేముంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఓటు వెయ్యాలి కదా చెల్లీ అంటూ తీన్మార్ మల్లన్న వైయస్ షర్మిల ను టార్గెట్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వైయస్ షర్మిల వెనుక పడుతుందని భావించిన రాజకీయవర్గాలకు షాక్ ఇస్తూ ఎవరు ఏ ప్రశ్న అడిగిన ధీటుగా సమాధానం చెప్తున్న షర్మిల, కేవలం ఒక స్థానికత విషయంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణా నా గడ్డ అని ప్రజల కోసం నిలబడి పోరాడే పార్టీ వైఎస్సార్ టీపీ అంటూ ఆమె చెబుతున్నా మళ్లీ మళ్లీ అదే స్థానికత అంశంపై టార్గెట్ చేస్తున్నారు.

తీన్మార్ మల్లన్న ఘాటు ప్రశ్నకు షర్మిల సూటిగా సమాధానం చెప్తారా ?
ఇప్పుడు తీన్మార్ మల్లన్న షర్మిలను టార్గెట్ చేస్తూ అడిగిన ప్రశ్నలకు ఆమె తీన్మార్ మల్లన్నకు ఏం సమాధానం చెబుతుంది అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి అతి తక్కువ కాలంలో వైయస్ షర్మిల రాజకీయ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యత దక్కింది అని చెప్పడానికి తాజాగా వైయస్ షర్మిలను వివిధ రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తున్న విధానమే నిదర్శనమని చెప్పవచ్చు. ఎవరెంత విమర్శిస్తున్నా తనదైన శైలిలో ముందుకు సాగుతున్న షర్మిల పక్కా ప్లాన్ తో తెలంగాణాలో రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications