తెలంగాణలో రెండున్నర వేల కరోనా కొత్త కేసులు: ఒక్కరోజులో లక్షకు పైగా: 9 జిల్లాల్లో అధ్వాన్నం
హైదరాబాద్: తెలంగాణలో అంతకంతకూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ ఆరంభంలో తొలుత 500 లోపు.. ఆ తరువాత వెయ్యిలోపు నమోదవుతూ వచ్చిన కొత్త కేసులు మరింత జోరందుకున్నాయి. రెండున్నర వేలకు చేరువ అవుతున్నాయి. యాక్టివ్ కేసుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యాక్టివ్ కేసులు 15 వేల మార్క్‌ను దాటేశాయి. ఈ పరిణామాల మధ్య కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో లక్షకు పైగా టెస్టింగులు నమోదయ్యాయి.

కొత్తగా 2,478 కరోనా కేసులు..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,478 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయిదుమంది మరణించారు. 363 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,182కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 3,03,964 మంది ఉన్నారు. 1,746 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదైంది. తాజా బులెటిన్ ప్రకారం.. 15,472 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 9,674 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ సహా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కొత్తగా 402 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీతో పాటు తొమ్మిది జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. కొన్ని చోట్ల వంద మార్క్‌ను దాటగా.. మరి కొన్ని చోట్ల 90కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకుని ఉండే జిల్లాల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 208 కొత్త కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలల్లో కరోనా విజృంభిస్తోంది.

జిల్లాలవారీ లెక్కలివే..
ఆదిలాబాద్-72, భద్రాద్రి కొత్తగూడెం-35, జగిత్యాల-105, జనగామ-23, జయశంకర్ భూపాలపల్లి-11, జోగుళాంబ గద్వాల-9, కామారెడ్డి-98, కరీంనగర్-87, ఖమ్మం-54, కొమరం భీమ్ ఆసిఫాబాద్-67, మహబూబ్‌నగర్-96, మహబూబాబాద్-16, మంచిర్యాల-85, మెదక్-33, మేడ్చల్ మల్కాజ్‌గిరి-208, ములుగు-4, నాగర్ కర్నూల్-43, నల్లగొండ-88, నారాయణ్‌పేట్-16, నిర్మల్-111, నిజామాబాద్-176, పెద్దపల్లి-33, రాజన్న సిరిసిల్ల-61, రంగారెడ్డి-162, సంగారెడ్డి-79, సిద్ధిపేట్-54, సూర్యాపేట్-39, వికారాబాాద్-55, వనపర్తి-33, వరంగల్ రూరల్-14, వరంగల్ అర్బన్-82, యాదాద్రి భువనగిరి-27 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video

లక్షకు పైగా కరోనా టెస్టింగులు..
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 1,01,986 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 48 శాతం కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 1,07,61,939గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 2,89,143 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications