హైదరాబాద్-శీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం... 8 మంది అక్కడికక్కడే మృతి
హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు వేగంగా ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో ఆ రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కార్లలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరో ఘటనలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు మంటల్లో దగ్ధమైన సంగతి తెలిసిందే. ఇంజిన్‌లో చెలరేగిన మంటలు క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులందరినీ కిందకు దింపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రయాణికుల కళ్లెదుటే బస్సు మంటల్లో దగ్ధమైంది.స్థానిక ఎమ్మెల్యే రాజయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications