తెలంగాణా అమర్‌నాథ్: ముగిసిన లింగమయ్య జాతర; సాహసోపేత సలేస్వరం యాత్ర!!
తెలంగాణ అమర్ నాథ్ గా పేరుగాంచిన సలేశ్వరం యాత్ర భక్త జనసంద్రంతో పోటెత్తింది. నల్లమల అడవుల్లో ఎత్తైన కొండలు లోయలను దాటుకుంటూ, సహజసిద్ధమైన జలపాతాలను దాటుకుంటూ, నాలుగు కిలోమీటర్ల మేర నడకమార్గాన వెళ్లి మూడు రోజులపాటు జరిగే జాతరలో లింగమయ్యను దర్శించుకున్నారు భక్తులు. నేటితో సలేశ్వరం యాత్ర ముగిసింది.
దక్షిణాది అమర్ నాథ్ గా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఈ సంవత్సరం కూడా భక్తులు పోటెత్తారు. కొండ కోనల్లో కొలువైన ఆ పరమశివుని కృప కోసం, అతి కష్టమైన మార్గంలో ప్రయాణం చేస్తూ సలేశ్వరం చేరుకుంటారు భక్తులు. చెంచులే పూజారులుగా అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువైన సలేశ్వరం లింగమయ్య భక్తులందరికీ ఉగాది తర్వాత వచ్చే తొలి పౌర్ణమికి దర్శనం ఇస్తారు. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.

కొండలు, లోయలు ఎక్కి దిగుతూ ఇరుకుదారుల్లో, సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం పక్కనుండి అతి జాగ్రత్తగా నడుస్తూ స్వామి వద్దకు చేరుకోవాలి. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిలోని పరహాపూర్ నుంచి రాంపూర్ చెంచు పెంట వరకు ఇసుకేస్తే రాలనంత జనం లింగమయ్య దర్శనానికి పయనం కావడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. సలేశ్వరం లోయలోకి వెళ్లేందుకు మరో మార్గమైన లింగాల మండలం అప్పాయి పల్లి గిరిజన గుండాల దారి సైతం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఈసారి విపరీతంగా సలేశ్వరానికి భక్తజనం పోటెత్తడంతో సగం మంది స్వామిని దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయారు.
ఈసారి సలేశ్వరం జాతరలో అపశృతి సైతం చోటుచేసుకుంది. ఒకరు గుండెపోటుతో, మరొకరు ప్రమాదవశాత్తు సలేశ్వరం జాతరకు వెళ్లిన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం నుండి నేటి వరకు ప్రతిరోజు రెండు లక్షల వరకు భక్తజనం లింగమయ్యను దర్శించుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన మార్గంలో, సహజ జలపాతం పక్కన ఉన్న బెత్తెడు బాటలో నడుస్తూ లింగమయ్యను దర్శించుకున్న భక్తులు ఈరోజు సాయంత్రంతో జాతర ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. కనీసం పది రోజులు పాటు నిర్వహించాల్సిన జాతరను కేవలం మూడు రోజుల పాటే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించడంతో ఒకేసారి పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు.












Click it and Unblock the Notifications