బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు : అక్టోబర్ 5 వరకు సమావేశాలు : బీజేపీ ఫైర్..!!
ఈ రోజు ప్రారంభమైన తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ రోజు సమావేశాలు ప్రారంభం కాగానే మరణించిన శాసనసభ్యులకు తొలుత సంతాపాలు ప్రకటించారు. అసెంబ్లీలో అజ్మీర్ చందూలాల్, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్‌ఆర్, మాచర్ల జగన్నాథం మృతికి సంతాపం తెలిపారు. మండలిలో రెహమాన్, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు. మొత్తం 9 మంది మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. అనంతరం ఉభయసభలు సోమవారానికి వాయిదా పడింది.
ఆ తరువాత అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఆ సమయంలో కేసీఆర్ కీలక సూచనలు చేసారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ నిర్వహణలో తెలంగాణ శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలి అని సూచించారు.
సభలో ప్రవేశపెట్టే బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలన్నారు. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశం అయితే కావలసినంత సమయం కేటాయించాలి అని కేసీఆర్ సూచన చేశారు. విపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సమయం ఎక్కువగానే కేటాయిస్తున్నాం అని తెలిపారు. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తరపున ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం అంశాలపై చర్చిస్తామని స్పష్టం చేసారు. విపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సమయం ఎక్కువగానే కేటాయిస్తున్నాం అని తెలిపారు. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే నెల 5 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 25, 26 (శని, ఆదివారాలు), అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 3 (ఆదివారం) తేదీల్లో సభకు సెలవు దినాలుగా ప్రకటించింది.
మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ తెలిపారు. గడిచిన సారి ఇలాగే జరిగిందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం లేకుండా బీఏసీ సమావేశం ఏర్పాటు చేయడం వారికే చెల్లిందని రాజాసింగ్, రఘునందన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications