తెలంగాణలో రుణమాఫీ, గ్యారంటీల అమలు - నిధులు, తుదిరూపు...!!
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామల దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే ప్రజా పాలన ద్వారా పథకాల అమలుకు ధరఖాస్తులు స్వీకరించింది. ఈ నెలాఖరులోగా ఏ పథకానికి ఎంత మంది లబ్ది దారులకు అర్హత ఉందో తేల్చే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వం..మిగిలిన వాటి అమలు దిశగా తుది రూపు ఇస్తోంది. లోక్ సభ ఎన్నికల నాటికి అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
గ్యారంటీలు - నిధులు: ఆరు గ్యారంటీల అమలు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి సవాల్ గా మారుతోంది. ఈ పథకాల అమలుకు నిధుల సమీకరణ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పథకాలు అమలు చేస్తే ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

ఈ క్రమంలోనే పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ 2024-25 వార్షిక బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి సమావేశాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈసారి 'ఓట్-ఆన్-అకౌంట్' బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. దీంతో కేంద్ర బడ్జెట్‌ను చూసిన తర్వాతే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్ సమావేశాలు: డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలు, పథకాలవారీగా ప్రతిపాదనలు పక్కాగా ఉండాలని చెబుతున్నారు. ఇలాంటి జాగ్రత్తల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ వాస్తవాల ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు. అనవసరంగా వ్యయాలను పెంచి, భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా.. వాస్తవ రాబడులను పక్కాగా అంచనా వేసి బడ్జెట్‌ను పెట్టనుంది.
ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ రాబడుల శాఖలను కూడా పక్కాగా అంచనా వేయాలని చెప్పారు. ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. బడ్జెట్ సమావేశాల్లోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకాన్ని మరోసారి ఎండగట్టడానికి సిద్ధమవుతున్నారు.
అమలు పై కసరత్తు: ఇక, ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద వ్యయ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించింది. మిగతా వాటిని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని ప్రకటించింది. ఈ దృష్ట్యా వీటికి తాజా బడ్జెట్‌లో నిధులను కేటాయించనుంది. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతు బంధు నిధుల జమ కొనసాగుతోంది.
రైతు రుణమాఫీ పైన ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు..నిధుల పైన ప్రభుత్వం బడ్జెట్ వేళ స్పష్టత ఇవ్వనుంది. అదే విధంగా మిగిలిన గ్యారంటీల అమలు పైన ప్రభుత్వం స్పష్టత ఇస్తూనే..మార్చి నుంచి సాధ్యమైన మేర అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో గ్యారంటీల అమలు పైన ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications