TS Polling Percentage: 3 గంటల వరకూ 52 శాతం పోలింగ్-మెదక్ టాప్-హైదరాబాద్ లాస్ట్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో సాధారణ ప్రజలతో పాటు పలువురు వీఐపీలు, వీవీఐపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం కాస్త మందకొడిగా కనిపించిన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకూ దాదాపు 52 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో మెదక్ లో అత్యధికంగా పోలింగ్ నమోదవుతోంది. హైదరాబాద్ ఎప్పటిలాగే పోలింగ్ శాతాల్లో చివరి స్ధానంలో నిలుస్తోంది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 69.33 శాతం పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్ లో అత్యల్పంగా 31.17 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 60 శాతం పైగా పోలింగ్ నమోదైంది.
రాష్ట్రంలో పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మొరాయించినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే ఈవీఎంలో ఓటు వేయడానికి 10సెకన్లు తీసుకుంటుందనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో చాలా చోట్ల ఓటింగ్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ను సాయంత్రం 5.30 గంటలకు ప్రకటించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పోలింగ్ సమయం పెంచే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications