తెలంగాణ ఎన్నికలు వాయిదా..?
జాతీయ రాజకీయాల్లో సంచలనం. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రధాని మోదీ ఆపరేషన్ -2024 ప్రారంభించారు. తమకు అనుకూలంగా పరిణామాలను మలచుకొనేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్ బిల్లు ఆమోదానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల తో పాటే జరిగే అవకాశం కనిపిస్తోంది.
మోదీ కొత్త లెక్కలు
ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం కోసం కొత్త అడుగులు వేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఈ సమావేశాల అజెండా బయటకు రాకపోయినా..మూడు కీలక బిల్లుల ఆమోదం కోసమేనే ప్రచారం సాగుతోంది. అందులో యూసీసీ బిల్లు, మహిళా బిల్లుతో పాటుగా జమిలి ఎన్నికల పైనా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

జమిలి ఎన్నికల వెనుక భారీ ప్లాన్ కనిపిస్తోంది. ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్ లక్ష్యంగా రాజ్యంగ సవరణకు సిద్దం అవుతోంది. దీని ద్వారా పార్లమెంట్ తో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది అసలు లక్ష్యం. ఈ ప్రతిపాదన పార్లమెంట్ ముందుకు వస్తే ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్
ఈ డిసెంబర్ లో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు కేంద్రం జమిలి ఎన్నికల దిశగా పార్లమెంట్ లో బిల్లు లేదా రాజ్యంగ సవరణలు చేస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ గడవు ముగిసే సమయానికి కొత్త సభ్యులతో సభ కొలువు తీరాల్సి ఉంది.
అదే సమయంలో ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. పార్లమెంట్ లో నిర్ణయం జరిగితే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతో పాటుగా జరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అదే సమయంలో మార్చిలో ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లొ పార్లమెంట్ తో పాటుగానే ఎన్నికలు జరగనున్నాయి.
పార్లమెంట్ సమావేశాలపై ఉత్కంఠ
ఇక, 2024 ద్వితీయార్ధంలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ కు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రం జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు చేస్తోంది. దీంతో, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికలను ముందుగానే..లోక్ సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించేలా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కేంద్రం అనుకున్నది అనుకున్నట్లుగా ప్లాన్ అమలు చేస్తే లోక్ సభతో పాటుగా 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ఆధ్వర్యంలో 16 మందితో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీంతో, ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా, లేక ఆలస్యం అవుతాయా అనేది స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications