తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త భయం: ఎంతమంది ఎమ్మెల్యేల ఫోన్లు స్విచాఫ్ అవుతాయో?
Telangana Congress: తెలంగాణలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. తామే అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకాన్ని ఆ పార్టీ నేతల్లో కలిగించాయి. సోమవారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్.. తన పదవికి రాజీనామా చేస్తారనీ చెబుతోంది కాంగ్రెస్.
ఒకట్రెండు మినహా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన విషయం తెలిసిందే. హస్తం పార్టీకి భారీ మెజారిటీని అందించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఎంత వరకు నిజం అవుతాయనేది ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నానికి స్పష్టం కానుంది. తాము గెలుస్తామనే ధీమా కాంగ్రెస్‌లో నెలకొంది.

ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికీ కాంగ్రెస్ నాయకులు ముహూర్తం పెట్టుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి దళిత సీఎం అనే కాన్సెప్ట్‌ను తెలంగాణలో అమలు చేయనుందని, దీనివల్ల వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందవచ్చని భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కొత్త భయం ఆవహించింది. ఈ కారణంతో ముందస్తు జాగ్రత్తలనూ తీసుకుంటోంది. హంగ్ అసెంబ్లీ వచ్చినా, బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితే ఎదురైనా.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది పెద్ద టాస్క్‌గా మారుతుందని భావిస్తోంది.
ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నేతలు.. తమ పార్టీలో గెలిచే అభ్యర్థులపై కన్నేశారని, వారిని ప్రలోభ పెడుతున్నారనీ అనుమానిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆదివారం ఫలితాలు వెలువడిన తరువాత అలాంటి వారందరి ఫోన్లు స్విచాఫ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయం నెలకొంది.
అందుకే ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. బీఆర్ఎస్‌తో పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా సీట్లను సాధించడం, లేదా హంగ్ అసెంబ్లీ (Hung Assembly) ఏర్పడితే- క్యాంప్ రాజకీయాలకు తెర తీసినట్టే అవుతుంది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంప్ రాజకీయాలకు దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజకీయ ప్రత్యర్థుల నుంచి తమ పార్టీ సభ్యులకు రక్షణ కల్పించడానికి రిసార్టులకు తరలించే అవకాశం ఉంది. గెలిచిన వెంటనే తమ అభ్యర్థులను బెంగళూరుకు తరలించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు పూర్తిగా వెలువడిన రోజు రాత్రి లేదా ఆ మరుసటి రోజు రెండు ప్రైవేటు బస్సుల్లో బెంగళూరుకు షిఫ్ట్ చేస్తారని సమాచారం.
బెంగళూరు శివార్లలోని దేవనహళ్లి వద్ద మూడు రిసార్ట్‌ను సైతం బుక్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక పీసీసీ అధినేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్‌కు సహాయం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications