తెలంగాణ ఎన్నికలు, భారీ ట్విస్ట్ - షెడ్యూల్ ప్రకారం జరగవా..!?
తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు. షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం లేదా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని తేల్చేసారు. కానీ, బీజేపీ నేతలు కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరింత సమయం కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ లో సాధ్యాసాధ్యాలపైన ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల నిర్వహణపైన చర్చ మొదలైంది.
పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ : తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం పలు మార్లు తెర మీదకు వచ్చింది. కానీ, ప్రతీ సమావేశంలోనూ కేసీఆర్ ఈ ప్రచారాన్ని ఖండించారు. ముందస్తుకు ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు.

ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ నేతలు మాత్రం ఎన్నికల పైన ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో పరిస్థితులు తమకు అనుకూలంగా మలచుకొనేందుకు కొత్త ప్రతిపాదన చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో, షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయా.. లేక, బీజేపీ నేతలు కోరుకున్నట్లుగా జరిగే అవకాశం ఉందా అనేది ఆసక్తిని పెంచుతోంది.
బీజేపీ నేతల కొత్త లెక్కలు : షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగాలి. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ జరిగే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికలతోనే తెలంగాణలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. దీని ద్వారా ఖర్చులు కలిసి రావటంతో పాటుగా, రాజకీయంగా మరింతగా బలం పెంచుకొనే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నట్లు సమాచారం.
ఇతర రాష్ట్రాలతో పాటుగా తెలంగాణ ఎన్నికలు జరిగితే అధినాయకత్వం అంతగా తెలంగాణ పైనే ఫోకస్ చేయలేదనేది మరో కోణం. ఇదే అంశం పైన తెలంగాణ బీజేపీ నేతలు నేరుగా ఢిల్లీలోని పార్టీ ముఖ్యుల వద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలు 2024 మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఇదే అభిప్రాయంతో చత్తీస్ ఘడ్, రాజస్థాన్ బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ - కాంగ్రెస్ పొత్తు పైనా : బీజేపీ నేతలు కోరుకున్నట్లుగా జరగాలంటే కేంద్ర కేబినెట్ ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘానికి మూడు నెలలు అటూ ఇటుగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని చెబుతున్నారు. తీర్మానంతో పాటుగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవటం ద్వారా మార్చిలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
మహారాష్ట్రలో కూడా ముందస్తు ఎన్నికల ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ -బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లినా, అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్లే అవకాశం లేదనేది బీజేపీ అంచనా. అందుకే రెండు కలిపి నిర్వహిస్తే రెండు పార్టీలు ఆత్మరక్షణలో పడతాయంటూ కేంద్ర నాయకత్వానికి నివేదించినట్లు సమాచారం. దీని పైన ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications