కరోనా వేళ కేసీఆర్ కీలక నిర్ణయం - సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ - అనూహ్య మార్పులు
కరోనా మహ్మారి రోజుకో రికార్డు నెలకొల్పుతున్నవేళ తెలంగాణలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 92వేలు దాటింది. ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 894 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ కు బలైపోయినవారి సంఖ్య 703కు పెరిగింది. కరోనా కట్టడి చర్యల్లో సర్కారు విఫలమైందంటూ హైకోర్టు తరచూ మందలిస్తున్నది. ఈ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ..
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల 7 నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున, కరోనా సమయంలోనూ సెషన్ నిర్వహించాల్సి వస్తున్నది. సోమవారం ప్రగతి భవన్ లో పలువురు మంత్రులతో చర్చించిన తర్వాత సీఎం ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేశారు.

అనూహ్య మార్పులు.. ఆదేశాలు..
తెలంగాణలో గరిష్ట రికవరీ రేటు, తక్కువ డెత్ రేటు ఉండటం ఊరట కలిగించే అంశం. అయితే, వైరస్ బారినపడిన నేతల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవాళ్ళే ఎక్కువగా ఉండటం తెలిసిందే. కరోనా వేళ నిర్వహిస్తున్న సమావేశాలు కావడంతో అసెంబ్లీ, మండలిలో సీటింగ్ విధానంలో అనూహ్య మార్పులు చేపట్టారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను సీఎం ఆదేశించారు.పలువురు మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రులు సిద్ధమేనా?
అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉందని, ఈ మేరకు ఆయా శాఖల మంత్రులు, అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ చివరిసారిగా మార్చిలో బడ్జెట్ సందర్భంగా సమావేశమైంది. 12 రోజుల పాటు అసెంబ్లీ, ఎనిమిది రోజులపాటు మండలి భేటీ అయింది. కాగా, సెప్టెంబర్ 7 నుంచి నిర్వహించబోయే వర్షాకాల సమావేశాలు 15 నుంచి 20 రోజులపాటు నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు.

పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీలో..
కరోనా వేళ అటు కేంద్రం సైతం పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సమాయత్తమవుతున్నది. గతానికి భిన్నంగా లోక్ సభ ఒక పూట, రాజ్య సభ ఒకపూట నిర్వహిస్తూ, ఫజికల్ డిస్టెన్స్ నిబంధనల ప్రకారం సీటింగ్ లో మార్పులు చేపట్టారు. చాంబర్ తోపాటు గ్యాలరీల్లోనూ సభ్యులు కూర్చోనున్నారు. ఆ మేరకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని, ఆడియో కన్సోల్స్, భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. గాలిలోని ఇతర సూక్ష్మ జీవులను నిర్వీర్యం చేయగలిగే అల్ట్రావయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్ పరికరాలను ఉభయ సభల్లో అమర్చుతున్నారు. పార్లమెంట్ తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలోనూ పకడ్బందీ ఏర్పాట్లతోనే సభ నిర్వహించాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నది.












Click it and Unblock the Notifications