బీ అలెర్ట్.. తెలంగాణలో భారీ అల్పపీడనం.. మరో 12 గంటలు డేంజర్..
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతంలో రానున్న 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 12 గంటల్లో జోరు వానలు, వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లోనూ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో నగరవాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలు పూర్తిగా జలమయం అయ్యాయి. జిల్లాల నుంచి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్-కామారెడ్డి మధ్య నేషనల్ హైవే కోతకు గురైంది. అలాగే హైదరాబాద్-నిర్మల్ మధ్య రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు జగిత్యాల- ఖానాపూర్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే భైంసా-బోధన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Northwest Bay is likely to see a fresh Monsoon Low in the next 12 to 36 hours. Under its influence parts of #AndhraPradesh & #Telangana states are likely to see widespread heavy/very heavy rains. In particular Northern parts of Telangana adjoining Central India. In particular…
— Anusha Puppala (@anusha_puppala) September 1, 2025
అయితే మరోసారి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. రాబోయే రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం, జయ్ శంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
మరోవైపు ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్నాయి. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా మారడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. గతంలో ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసేవి. కానీ వాతావరణ మార్పుల కారణంగా వాయుగుండం తరహాలో వర్షపాతం నమోదవుతోంది.

ఇక దేశవ్యాప్తంగా సెప్టెంబరు నెలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షాలే కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. సాధారణంగా ఏటా సెప్టెంబరులో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు ఉంటుంది. అయితే ఈసారి అదే నెలలో సాధారణం కంటే 109 శాతం ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఈశాన్య భారత్, తూర్పు భారత్, దక్షిణ భారత్, వాయవ్య భారత్ లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే పడొచ్చని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications