రైతులకు శుభవార్త చెప్పిన కేసీఆర్: బడ్జెట్ లో సాగుకు అగ్రస్థానం; రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్!!
2023-24 వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతులకు శుభవార్త చెప్పిన కేసీఆర్ బడ్జెట్ లో సాగుకు పెద్దపీట వేశారు. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నేడు 2023- 2024 సంవత్సరానికి గాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు శుభవార్త చెప్పారు. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి 6385 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

బడ్జెట్ లో వ్యవసాయానికి భారీగా కేటాయింపులు
తెలంగాణ రాష్ట్ర 2023- 2024 సంవత్సర బడ్జెట్లో ఏకంగా వ్యవసాయ రంగానికి 26,831 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి రైతులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా మంత్రి హరీష్ రావు తెలిపారు.

గతంతో పోలిస్తే గణనీయంగా వ్యవసాయానికి కేటాయింపులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాక పది సంవత్సరాల ముందు వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం 7,994 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయగా, రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం 1, 91,612 కోట్ల రూపాయలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులను ఖర్చు చేసిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫిలలో తెలంగాణా టాప్ లో
తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ మోడల్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని పేర్కొన్న హరీష్ రావు బడ్జెట్ కేటాయింపులలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసినట్లుగా తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నారని, రైతు రుణమాఫీ చేస్తున్న రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో రైతాంగానికి సాగునీటిని అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

పామాయిల్ సాగుకు బడ్జెట్ కేటాయింపులు ఇలా
సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, కల్తీ విత్తనాలను నియంత్రిస్తున్నామని, రైతు వేదికలు, పంటకల్లాల నిర్మాణం చేపట్టి, రైతుబంధు సమితులను ఏర్పాటు చేసి రైతాంగానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇక పామాయిల్ సాగు ద్వారా ప్రతి ఎకరాకు దాదాపు లక్షా 50 వేల రూపాయల వరకు రైతులకు ఆదాయం వస్తుందని పేర్కొన్న హరీష్ రావు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షలు ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు బడ్జెట్లో వెయ్యి కోట్లు ప్రతిపాదిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

రైతుల కోసం బడ్జెట్ లో కేటాయింపులు ఇలా
అంతేకాదు రైతు వేదికలకు 26,835 కోట్లు, రైతు బీమాకు 1589 కోట్లు, రైతుబంధుకు 1575 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో సాగుకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత నిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలను చేయాలని భావిస్తున్న కేసీఆర్ తమ పార్టీ జాతీయ అజెండాకు తగ్గట్టుగా రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ నిధులను కేటాయించారు.












Click it and Unblock the Notifications