ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం పక్కా..!
తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉత్కంఠగా మారాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా, వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. సుప్రీంకోర్టు నోటీసులకు స్పందించిన స్పీకర్, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం, వారు పార్టీ మారలేదని బదులివ్వడంతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. అయితే, ఉప ఎన్నికలు వస్తే ఆ పది స్థానాలలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ సతీమణిని, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌ను అభ్యర్థులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో జరిగే ఈ పోరులో బీఆర్ఎస్‌కు కొంత అడ్వాంటేజ్ ఉందని సర్వేలు సూచిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్‌కు ఉన్న చరిష్మా బీఆర్ఎస్‌కు లాభిస్తుందని అంచనా. అయితే, ఈసారి గెలిచి తీరుతానని నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం గమనార్హం.

మరోవైపు, ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ సర్వే ప్రకారం, ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే, జగిత్యాల, గద్వాల స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని తేలింది. అయితే, ఎన్నికల ముందే వచ్చే సర్వేలు కేవలం అంచనాలు మాత్రమే. అంతిమంగా విజేతను నిర్ణయించేది ప్రజలు మాత్రమే. మరి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి గెలుపు అవకాశాలుంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications