ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ: గవర్నర్ ప్రసంగానికి ఆమోదం, అవే కీలకం
తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సుమారు గంటన్నరపాటు చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందనే అంశాలపై గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటినీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగితా నాలుగు గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇక, ప్రతిపక్షాలు కూడా గవర్నర్ ప్రసంగంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా ఉండనుందని జోస్యం చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని చెబుతారని అంటున్నారు. అయితే, గత ప్రభుత్వం చేసిన లెక్కలన్నీ ఆడిట్ రిపోర్టులోనే ఉన్నాయని.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకోవచ్చంటున్నారు.
మరోవైపు, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పులు చేసి పోయిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ ఉచిత హామీలు ఎలా, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలకు కావాల్సిన నిధులను ఎలా సమకూర్చుతారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మరింత అప్పుల మయంగా మార్చొద్దని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications