18న తెలంగాణ కేబినెట్ భేటీ: కొత్త సచివాలయంలో తొలి సమావేశం
హైదరాబాద్: మే 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
కాగా, కొత్త సచివాలయంలో ఇది తొలి కేబినెట్ సమావేశం కావడం గమనార్హం. ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇలావుండగా, బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీల సమావేశం మే 17వ తేదీన జరగనుంది.

పీసీసీఎఫ్‌గా ఆర్‌ఎం డోబ్రియాల్: ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా (PCCF, HOFF) రాకేశ్ మోహన్ డోబ్రియాల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పని చేసిన పీసీసీఎఫ్ పదవీ విరమణ చేయడంతో డోబ్రియాల్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆయనకు పూర్తిస్థాయిలో పీసీసీఎఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో అరణ్య భవన్‌లో ఆర్‌ఎం డోబ్రియాల్ బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా, హరిత తెలంగాణ సాధనకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేస్తామమని తెలిపారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ ప్రాధాన్యం: తలసాని
ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీలో గల నేతాజీ కమ్యునిటీ హాల్‌లో, జంబాగ్ డివిజన్‌లోని సుబాన్‌పురా కమ్యునిటీ హాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను మంత్రి శ్రీనివాస్ యాదవ్.. ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌లతో కలిసి ప్రారంభించారు.
కాగా, గన్ ఫౌండ్రీ బస్తీ దవాఖానాలో మంత్రికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 350 బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటికే 153 బస్తీ దవాఖానలు పని చేస్తుండగా, నూతనంగా 14 బస్తీ దవాఖానలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications