కేసీఆర్ ఏం చేయబోతున్నారు?..21న ప్రత్యేక అసెంబ్లీ భేటీ ఎందుకు?
హైదరాబాద్: వచ్చే ఏడాది తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఎప్పట్లాగే ఈ సారి కూడా టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్యే ప్రధానంగా ఎన్నికల పోరు నెలకొననుంది. ఒకప్పుడు బలమైన ఓటుబ్యాంక్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాన్ని కోల్పోయింది. టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటోన్న చేరికలు ఉంటోన్నాయి.

చేరికల వేళ..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఇప్పటికే కాషాయ కండువాను కప్పుకొన్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. రెండు రోజుల కిందటే ఆయన పార్టీ, ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ప్రదీప్ రావు బీజేపీలో చేరబోతోన్నారనే ప్రచారం ఉంది. దీనికోసం ఆయన ముహూర్తాన్ని చూసుకుంటోన్నారని చెబుతున్నారు.

21న కోమటిరెడ్డి..
కాంగ్రెస్ పార్టీకి చెందిన బిగ్ షాట్, నల్లగొండ జిల్లా మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. తన పదవికీ రాజానామా చేశారు. సోమవారమే ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతోన్నారు. ఈ నెల 21వ తేదీన ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకోనున్నారు. ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ముందస్తు ఎన్నికలు ఉండొచ్చనే ప్రచారం కూడా దీనికి తోడైంది.

ఎల్లుండి కేబినెట్..
ఈ పరిణామాల మధ్య తెలంగాణ మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దీనికి అధ్యక్షత వహించనున్నారు. పలు అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. ఆర్థిక, రాజకీయ అంశాల గురించి మంత్రులు చర్చించనున్నారు. 1వ తేదీ నాటికి జీతాలు ఇవ్వట్లేని పరిస్థితుల్లో తెలంగాణ ఉందనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. రెవెన్యూ తగ్గుతోండటం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయం మీద మంత్రులు చర్చిస్తారు.

21న అసెంబ్లీ..
ఈ నెల 21వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అసెంబ్లీని సమావేశపర్చనున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా 15 రోజులపాటు వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి ముగింపు సూచకంగా 21వ తేదీన ఒక్కరోజు అసెంబ్లీని సమావేశపర్చుతారు.

జాతీయ రాజకీయాల్లోకి..
కేసీఆర్ పూర్తిస్థాయి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టే విషయం కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చకు రావొచ్చు. చాలా రోజుల నుంచి ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడానికి ఆసక్తిగా ఉన్నారు. అదే విషయం మీద మంత్రులతో చర్చిస్తారు. తాను అటు వెళ్లాల్సి వస్తే- రాష్ట్రస్థాయిలో పార్టీ స్థితిగతులు, ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి చర్చించే అవకాశం లేకపోలేదు. బిహార్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపైనా కేసీఆర్.. తన కేబినెట్ సహచరులతో చర్చిస్తారు.
Recommended Video


మునుగోడు బాధ్యతలపై..
నల్లగొండ జిల్లా మునుగోడులో చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూడా మంత్రివర్గంలో చర్చకు వస్తాయని తెలుస్తోంది. ఉప ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఈ స్థానానికి సంబంధించిన బాధ్యతలను మంత్రులకు అప్పగిస్తారనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో గెలిచి తీరాల్సి ఉంటుందంటూ కేసీఆర్..మంత్రులకు హితబోధ చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications