ఓ వైపు రేవంత్- మరో వైపు కేంద్రమంత్రులు: పోటాపోటీ..!!
తెలంగాణలో నేడు ప్రజా పాలన దినోత్సవాలు ఘనంగా ఆరంభం అయ్యాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను అధికార యంత్రాంగం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటున్న రెండో ప్రజా పాలన ఉత్సవాలు ఇవి. మంత్రులు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.
సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినంగా జరుపుకోవడం ఆనవాయితీ. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో ఈ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటించింది. 2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మార్చివేసింది. ప్రజా పాలన దినోత్సవంగా సవరించింది. దీని ద్వారా ప్రజాస్వామ్య పాలన, ప్రజల భాగస్వామ్యంపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజును హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోనుంది.

ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇందులో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా విమోచన దినోత్సవాన్ని పాటిస్తోంది. 2023లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. నిజాం అణచివేత పాలన నుండి విముక్తి పొందిన రోజుగా బీజేపీ ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటోంది.
గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రతి సంవత్సరం 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా జరుపుకోవాలని ప్రకటించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాల సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) పరేడ్ గౌరవ వందనం స్వీకరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు.












Click it and Unblock the Notifications